అవగాహన లేని రాజకీయాలు చేస్తున్న జగన్ : చంద్రబాబు నాయుడు

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. గుంటూరులో జరిగిన వైసీపీ జాతీయ ప్లీనరీలో జగన్ వాస్తవాలు మాట్లాడలేదని అందరికీ తెలుసని చంద్రబాబు అన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తెదేపా ఎంపీలతో నిర్వహించిన సమావేశం సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఆ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ భూషణే గెలిపిస్తాడని జగన్ చెబుతున్నారన్నారు. అలా చెప్పి జగన్ తన అసమర్థతను నిరూపించుకున్నారని పేర్కొన్నారు. జగన్ అవగాహనలేని రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ పక్షానే ఉన్నారని ఎంపీలతో చెప్పారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్దామని పిలుపునిచ్చారు.

కాగా ప్లీనరీ లో చంద్రబాబుపై ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఆరోపణలపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ అసూయపడుతున్నారన్నారు. అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని అన్నారు. 40 ఏళ్లుగా చంద్రబాబు రాజకీయాల్లో కొనసాగుతున్నారని ఆయనపై చేసిన ఆరోపణల్లో ఒక్కదాన్నినిరూపించలేకపోయారన్నారు.

చంద్రబాబును తిట్టడం కోసమే వైసీపీ ప్లీనరీ ఏర్పాటు చేసినట్లు ఉందన్నారు. జగన్ ప్రకటించిన హామీలన్నీ 2014 ఎన్నికల్లో తాము ఇచ్చి అమలు చేసినవేనని పేర్కొన్నారు. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం అవే హామీలు జగన్ ఇస్తున్నారని లోకేశ్ విమర్శించారు. తనపై తనకు నమ్మకం లేకనే జగన్….ప్రశాంత్ కిషోర్ను తెచ్చుకున్నారని ఆరోపించారు.

Loading...