‘ఆనందో బ్రహ్మ’ రివ్యూ

anando brahma movie review,anando brahma review,taapsee pannu,sreenias reddy,shakalaka shankar
anando brahma movie review,anando brahma review,taapsee pannu,sreenias reddy,shakalaka shankar

చిత్రం : ‘ఆనందో బ్రహ్మ’

నటీనటులు: తాప్సి – శ్రీనివాసరెడ్డి – వెన్నెల కిషోర్ – షకలక శంకర్ – తాగుబోతు రమేష్ – రాజీవ్ కనకాల – రాజా రవీంద్ర – విజయ్ చందర్ – సుప్రీత్ – తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: కృష్ణకుమార్
ఛాయాగ్రహణం: అనీష్ తరుణ్ కుమార్
నిర్మాతలు: విజయ్ చిల్లా – శశి దేవిరెడ్డి
రచన – దర్శకత్వం: మహి కె.రాఘవ్

ఒక్క మాటలో : ఆనందో బ్రహ్మ నవ్వులు పండించింది

చాన్నాళ్లుగా తెలుగు తెరపై కనిపించని తాప్సి.. మళ్లీ ఇప్పుడు ‘ఆనందో బ్రహ్మ’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘పాఠశాల’తో దర్శకుడిగా పరిచయమైన మహి కె.రాఘవ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. డిఫరెంట్ ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ హార్రర్ కామెడీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది.తాప్సి ఆనందో బ్రహ్మ ప్రొమోషన్స్ కొరకు నిన్న బిగ్ బాస్ షోలో సందడి చేసి ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను చెప్పి ప్రేక్షకులు ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది…. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఒక పెద్ద ఇంటిని అమ్మకానికి పెడితే అందులో దయ్యాలున్నాయన్న భయంతో ఎవరూ కొనడానికి ముందుకు రారు. అలాంటి స్థితిలో ఆర్థికంగా చాలా అవసరాలున్న సిద్ధు (శ్రీనివాసరెడ్డి) కమీషన్ కోసం ఆశపడి ఆ ఇంట్లో మూడు నాలుగు రోజులుండి దయ్యాల్లాంటివేమీ లేవని నిరూపించాలనుకుంటాడు. తన లాగే ఆర్థిక అవసరాలున్న ఇంకో ముగ్గురిని తనకు తోడుగా ఆ ఇంట్లోకి తీసుకెళ్తాడు. మరి ఆ ఇంట్లో వారికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.. అక్కడ నిజంగానే దయ్యాలున్నాయా.. ఉంటే వాటిని ఈ నలుగురూ ఎలా ఎదుర్కొన్నారు.. చివరికి ఏమైంది? అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

‘ఆనందో బ్రహ్మ’లో దయ్యాల్ని చూసి మనుషులు భయపడరు. మనుషుల్ని చూసే దయ్యాలు కంగారు పడతాయి. ఐతే ఈ విషయం ‘ఆనందో బ్రహ్మ’ ట్రైలర్లోనే రివీల్ చేసేశాడు దర్శకుడు మహి కె.రాఘవ్. ఆ సంగతి ముందే తెలిశాక కూడా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం సవాలే. ఆ విషయంలో మహి కొంతమేర విజయవంతమయ్యాడు. దయ్యాల్ని మనుషులు కంగారు పెట్టే ఎపిసోడే ‘ఆనందో బ్రహ్మ’లో కొత్తగా అనిపించే విషయం.. అలాగే ప్రధాన ఆకర్షణ కూడా. అది మినహాయిస్తే ఇందులో భిన్నంగా ఏమీ లేదు. చాలా వరకు పాత హార్రర్ కామెడీల్ని గుర్తుకు తెస్తూనే.. కొత్తగా అనిపించే కోర్ కాన్సెప్ట్.. అక్కడక్కడా నవ్వించే కామెడీ ఎపిసోడ్లతో ‘ఆనందో బ్రహ్మ’ టైంపాస్ చేయించేస్తుంది.

దయ్యాల్ని మనుషుల్లా.. మనుషుల్ని దయ్యాల్లా ప్రొజెక్ట్ చేస్తూ కథను మొదలుపెట్టడంతో ‘ఆనందో బ్రహ్మ’ ఆరంభంలోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. కానీ ఆ ఆసక్తి ఎంతోసేపు నిలిచి ఉండదు. దయ్యాల్ని చూసి మనుషులు భయపడే సన్నివేశాలతో ఇది సగటు హార్రర్ కామెడీల్లాగే సాగుతుంది. ఇల్లు-దయ్యాల వ్యవహారం నుంచి బయటికొచ్చి… ప్రధాన పాత్రల పరిచయంలోకి వెళ్లాక ‘ఆనందో బ్రహ్మ’ చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. పాత్రల నేపథ్యాలు ఏవి కూడా ఆసక్తికరంగా అనిపించవు. ‘మనీ’లో బ్రహ్మానందం-భరణి ఎపిసోడ్ ను.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో చంద్రమోహన్ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాల్ని వాడుకుని షకలక శంకర్.. శ్రీనివాసరెడ్డిల నేపథ్యాల్ని చూపించాడు దర్శకుడు. అవి చాలా పేలవంగా తయారయ్యాయి. వెన్నెల కిషోర్ పరిచయం కూడా మామూలే.

ఐతే ప్రధాన పాత్రలు దయ్యాల కొంపలోకి తీసుకెళ్లాక కథనం రక్తి కడుతుంది. ద్వితీయార్ధంలో మనుషులకు.. దయ్యాలకు మధ్య వచ్చే సన్నివేశాలు భలేగా పేలాయి. ముఖ్యంగా షకలక శంకర్.. వెన్నెల కిషోర్ పాత్రల చుట్టూ అల్లుకున్న కామెడీ అదిరిపోతుంది. పాత్రల తాలూకు బలహీనతలే వాటికి బలం కావడం.. రివర్స్ లో దయ్యాల్ని భయపెట్టడం ఆసక్తి రేకెత్తిస్తోంది. కొన్ని చోట్ల లాజిక్ అన్నది పూర్తిగా పక్కన పెట్టేసినప్పటికీ కామెడీ బాగా పండటంతో ప్రేక్షకులకు అది పెద్ద ఇబ్బందిగా అనిపించదు. ద్వితీయార్ధంలో ఓ అరగంట పాటు కథనం శరవేగంగా సాగిపోతుంది. ఇక ప్రి క్లైమాక్స్ నుంచి కథ మామూలుగా సాగిపోతుంది. దయ్యాల ఫ్లాష్ బ్యాక్.. వాటి ప్రతీకారంతో సినిమా అనుకున్న లైన్స్ లోనే ముగుస్తుంది.

చక్కగా ఆరంభమై.. వెంటనే డౌన్ అయ్యే ‘ఆనందో బ్రహ్మ’ మధ్యలోంచి పుంజుకుని చివరికి ఓ మోస్తరు ఫీలింగ్ తో ముగుస్తుంది. దయ్యాల నేపథ్యంలో సినిమా అంటేనే లాజిక్ సంగతి పక్కన పెట్టేయాలి. ఇందులో దర్శకుడు మరింత స్వేచ్ఛ తీసుకున్నాడు. మరీ ఇల్లాజికల్ గా కథాకథనాల్ని నడిపించడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. పాటల్లాంటివేమీ లేకపోవడం.. 2 గంటల నిడివిలో ముగిసిపోవడం కలిసొచ్చే అంశమే. దయ్యాల్ని మనుషులు భయపెట్టడం అనే కాన్సెప్ట్.. నటీనటుల చక్కటి అభినయం.. కొన్ని కామెడీ సీన్లు.. ‘ఆనందో బ్రహ్మ’కు ప్లస్. ఓవరాల్ గా చూస్తే సగటు హార్రర్ కామెడీల్లాగే సాగిపోవడం.. పాత సినిమాలు చాలా వాటిని గుర్తుకు తేవడం మైనస్.

నటీనటులు:

‘ఆనందో బ్రహ్మ’కు నటీనటుల అభినయం అది పెద్ద ప్లస్ పాయింట్. చాన్నాళ్ల తర్వాత తెలుగులో సినిమా చేసిన తాప్సి తన పాత్రకు తగ్గట్లుగా సింపుల్ గా నటించింది. తన పాత్రకు తాప్సి చక్కగా సరిపోయింది. ఐతే ఆమె కంటే కూడా శ్రీనివాసరెడ్డి-వెన్నెల కిషోర్-షకలక శంకర్-తాగుబోతు రమేష్ బ్యాచ్ ఎక్కువ ఆకట్టుకుంటుంది. ‘హీరో’ అనిపించుకోవాలని తాపత్రయ పడకుండా ప్రధాన పాత్రధారుల్లో ఒకడిగా తనకు తగ్గ పాత్రల్ని ఎంచుకుంటున్న శ్రీనివాసరెడ్డిని అభినందించాలి. ‘గీతాంజలి’లో మాదిరే కథలో కీలకమైన పాత్రలో అతను చక్కగా ఒదిగిపోయాడు.

వెన్నెల కిషోర్ రేచీకటి పాత్రలో తనదైన శైలిలో నవ్వించాడు. ఎప్పట్లాగే హడావుడి చేయకుండా సింపుల్ గా.. సటిల్ గా సాగే అతడి నటన.. హావభావాలు కడుపుబ్బ నవ్విస్తాయి. సినిమాలో అందరికంటే ఎక్కువ నవ్వించిన క్రెడిట్ మాత్రం షకలక శంకర్ దే. అతడి మిమిక్రీ.. మోనో యాక్షన్ టాలెంట్ ను దర్శకుడు బాగా వాడుకును్నాడు. సినిమా పిచ్చి ఉన్న పాత్రలో చిరు.. పవన్ కళ్యాణ్ లను అనుకరిస్తూ సాగే అతడి కామెడీ బాగా పేలింది. తాగుబోతు రమేష్ కూడా తన ట్రేడ్ మార్క్ పాత్రలో నవ్వించాడు. రాజీవ్ కనకాల.. విజయ్ చందర్ కూడా బాగా చేశారు.

సాంకేతికవర్గం:

ఈ చిత్రానికి సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. కృష్ణకుమార్ నేపథ్య సంగీతం.. అనీష్ తరుణ్ కుమార్ ఛాయాగ్రహణం సినిమాకు ఒక కొత్త ఫీల్ తీసుకొచ్చాయి. దర్శకుడి శైలికి తగ్గట్లుగా రెండూ బాగా కుదిరాయి. తక్కువ లొకేషన్లలో.. పరిమిత బడ్జెట్లో తెరకెక్కిన సినిమా అయినప్పటికీ క్వాలిటీ కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ మహి కె.రాఘవ్ మంచి స్టోరీ టెల్లర్ అనిపించుకున్నాడు. అతడి నరేషన్ స్టైల్ భిన్నంగా అనిపిస్తుంది. మహి ఎంచుకున్న కోర్ కాన్సెప్ట్ బాగుంది. కానీ చాలా వరకు పాత సినిమాల నుంచే సన్నివేశాల్ని తీసుకుని కథను నడిపించే ప్రయత్నం చేయడం నిరాశ పరుస్తుంది. ద్వితీయార్ధం మాదిరే ఓ నలభై నిమిషాలు మంచి పట్టు చూపించాడు మహి. అక్కడ కామెడీ బాగా వర్కవుట్ చేశాడు. నటీనటుల్ని సరిగ్గా ఉపయోగించుకున్న తీరు కూడా మెప్పిస్తుంది. కానీ సినిమా మొత్తంలో చూసుకుంటే నిలకడ చూపించలేకపోయాడు. అతడి కొత్త ఆలోచనలు ఒక దశ వరకే పరిమితమయ్యాయి.

రేటింగ్- 2.75/5

Loading...