వెంకయ్య ఘన విజయం.. ఇక ఉపరాష్ట్రపతిగా..

వెంకయ్య ఘన విజయం.. ఇక ఉపరాష్ట్రపతిగా..

న్యూఢిల్లీ : దేశంలో రెండో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అనుకున్నట్లుగానే ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఘనవిజయం సాధించారు. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాల కృష్ణ గాంధీపై 272 ఓట్ల మెజార్టీని సాధించారు. మొత్తం 781 ఓట్లకుగాను 771ఓట్లు పోలవ్వగా వెంకయ్యనాయుడికి 516 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణకు 244 ఓట్లు వచ్చాయి. శనివారం ఉదయం 10 గంటలకు పార్లమెంట్‌ ఆవరణలో మొదలైన ఈ ఓటింగ్‌ ప్రక్రియ, సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

దీంతో వెంటనే పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు కొనసాగుతున్న హమీద్‌ అన్సారీ పదవీకాలం ఈ నెల 10తో ముగియనుంది. దీంతో ఆగస్టు 11న ఆయన భారతదేశానికి 13వ ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల మాదిరిగానే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎవరి అంచనాలకు అందకుండా వెంకయ్యానాయుడి ఎన్డీయే నాయకత్వం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈయనపై పోటీ చేసిన మహాత్మాగాంధీ మనవడు, పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీకి ప్రతిపక్షాలు మద్దతిచ్చాయి. లోక్‌సభలో మెజార్టి ఉన్న ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడి గెలుపు లాంఛనప్రాయమేనని అనుకున్న విషయం తెలిసిందే.

రైతు కుటుంబం నుంచి..
సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్యనాయుడి ప్రస్థానమంతా చాలా ఆసక్తిగా కనిస్తుంది. ముఖ్యంగా ఆయనకు ఆభరణం మాట. చక్కటి మాటలతో ఆయన ఎవరినైనా మంత్రముగ్దుల్ని చేయగలరు. ఏ అంశాన్నయినా విశ్లేషించగలరు. విద్యార్థి దశ నుంచి తనలో మొలకెత్తిన నాయకత్వ లక్షణాలను పొదివిపట్టుకున్న ఆయన అంచలంచెలుగా ఎదిగి దేశంలోనే రెండో అత్యున్నత పదవిని అందుకున్నారు. సొంత ప్రతిభతోపాటు తాను ఎంతో నమ్ముకున్న పార్టీని కడవరకు అంటిపెట్టుకునే ఉన్నందుకే ఆయనను ఈ అదృష్టం దక్కిందని చెప్పాలి.

వెంకయ్య బాల్యం గురించి సంక్షిప్తంగా..
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని చవటపాళెం అనే గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో వెంకయ్యనాయుడు జన్మించారు. చిన్నతనంలోనే ఆయన తల్లి చనిపోవడంతో మేనమామ మస్తాన్‌నాయుడు ఆదరణలో శ్రీరామపురంలో పెరిగారు. అక్కడే పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం నెల్లూరు వెళ్లటానికి సుమారు 6 కి.మీలు నడిచి వెళ్లేవారు. నెల్లూరులో డిగ్రీ వరకు చదివిన ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1971 ఏప్రిల్‌ 14న ఉషమ్మను వివాహం చేసుకున్నారు.

రాజకీయాలవైపు..
ప్రతికూల పరిస్థితుల్ని సైతం తనకు అనుకూలంగా మార్చుకునే ఆయన రాజకీయాల్లో అజాత శత్రువనే చెప్పాలి. సమయస్ఫూర్తి, వాగ్ధాటి ఆయన సొంతం లౌక్యం, మాటకారితనం, కష్టపడి పనిచేసే తత్వం ఈ స్థాయికి తీసుకెళ్లాయి. విశాఖపట్నంలో న్యాయవాద విద్య అభ్యసించేటప్పుడు జైఆంధ్రా ఉద్యమంలో పాల్గొని విద్యార్ధి నేతగా మారారు. ఉద్యమంలో అరెస్టై తొలిసారి జైలుకు వెళ్లిన ఆయన తర్వాత జయప్రకాశ్‌ నారాయణ్‌(జేపీ) ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో విద్యార్ధి సంఘర్షణ సమితి పేరుతో కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించి జైలుకు వెళ్లారు. తొలిసారి 1977లో జనతా పార్టీ తరఫున ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1978లో ఇందిర ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లోనే ఆయన నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి గెలుపొందారు. ఎన్టీఆర్‌ హయంలో కూడా రెండోసారి విజయం సాధించారు. 1987 డిసెంబర్‌ 31 నుంచి నాలుగు రోజులపాటు విజయవాడలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో 45నిమిషాలపాటు వెంకయ్య చేసిన ప్రసంగం నాటి అగ్ర నేతలు వాజ్‌పేయి, అద్వానీలను అమితంగా ఆకర్షించింది. దీంతో ఆయనకు జాతీయ రాజకీయాల్లో ప్రవేశం దొరికినట్లయింది. ఆ తర్వాత ఆయన జాతీయ నేతగా వివిధ పదవులు నిర్వహించారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.

రాజకీయ ప్రస్తానం
1973-74 : ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షులు1974-75 : లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ యువజన సంఘర్ష్‌ సమితి రాష్ట్ర విభాగం కన్వీనర్‌1977-80 : జనతాపార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు1978-83 : నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారిగా ఎన్నిక1980-83 : ఏపీ భాజపా రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి1983-85 : ఉదయగిరి నియోజకవర్గం నుంచి రెండోసారి శాసనసభకు ఎన్నిక (భాజపా శాసనసభపక్ష నేత)1988-93 : ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు1993-2000 : భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి1998 : కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నిక. భాజపా పార్లమెంటరీ కార్యదర్శిగా, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శిగా, పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు.1998-99 : హోంమంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీ, వ్యవసాయ కమిటీల్లో సభ్యుడు.2000-02: వాజ్‌పేయి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి2002-04 : భాజపా జాతీయ అధ్యక్షుడు2004 : కర్ణాటక నుంచి రెండో సారి రాజ్యసభకు ఎంపిక2014-: నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, సమాచార శాఖ మంత్రి. కొన్నాళ్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్నారు.2016 : రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు నాలుగోసారి ఎన్నిక2017 : ఆగస్టు 5న ఉపరాష్ట్రపతిగా ఎన్నిక

Loading...