శమంతకమణి హీరోల జోరు

టాలీవుడ్ హీరోల మనసులు చాలా విశాలం. కానీ.. వారి మాటల్లో మాత్రమే. చేతల విషయానికి వస్తే.. ఎవరి వృత్తంలో వారుంటారే తప్ప.. పక్కకు రావటానికి కూడా ఇష్టపడరు. అంతేనా.. వారి వృత్తంలోకి ఇంకెవరైనా వస్తానన్నా ససేమిరా అంటారు. అందుకే.. టాలీవుడ్ లో మల్టీస్టారర్ ఫిలిం చాలా అరుదు.

నిజానికి మల్టీస్టారర్ మూవీస్ చేయాలంటే పెద్ద మనసు ఉండాలి. కథలు కొరత అంటారు కానీ.. హీరోలు కలిసి చేయటానికి సిద్ధంగా ఉంటే.. కథలు వాటంతట అవే వస్తాయి. బాలీవుడ్‌ను చూస్తే.. అక్కడ ఆగ్రహీరోలు సైతం ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా మల్టీస్టారర్ మూవీస్‌ను చేయటానికి పెద్దగా పట్టింపులకు పోరు.

కానీ.. టాలీవుడ్‌కి వస్తేనే సమస్య అంతా. ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తేనే హడావుడి హడావుడి చేసేస్తారు. సినిమా మొదలైనప్పటికీ రిలీజ్ అయిన ఆర్నెల్ల వరకూ మీ ఇద్దరి షూటింగ్ అనుభవాలేంటంటూ అదే పనిగా అడిగిన ప్రశ్నను.. అదే పనిగా అడిగేస్తుంటారు.

కానీ.. ఇందుకు భిన్నంగా ఒకే సినిమాలో నలుగురు హీరోలు నటించటం అంటే చిన్న ముచ్చట కాదు. ఇటీవల కాలంలో అలాంటి కాంబినేషన్ లో టాలీవుడ్ లో సినిమా అన్నది వచ్చిందే లేదని చెప్పాలి. నారా రోహిత్.. ఆది.. సందీప్.. సుధీర్ కుమార్ ల కాంబినేషన్ తో శమంతకమణి పేరుతో మూవీ తీశారు. ఈ కాంబినేషన్ మీద మొదట్నించి ఆసక్తి వ్యక్తమైనా.. టీజర్ తో ఈ మూవీ మీద అంచనాలు అంతకంతకూ పెరిగిపోయాయని చెప్పాలి. ఈ వారంలో వెండితెర మీద మెరవనున్న వేళ.. చిత్రంలో నటించిన నలుగురు హీరోల బృందం చిల్ అవుట్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. మాంచి హుషారుగా.. రోడ్డు మీద వీరిచ్చిన ఫోజ్ ఆకట్టుకునేలా ఉంది. యూత్ పార్టీ అన్న చందంగా ఉన్న ఈ ఫోటోను నారా రోహిత్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోను చూసినంతనే యూత్ హుషార్ అంతా కుప్పపోసినట్లుగా కనిపించక మానదు. సినిమా రిలీజ్‌కు ముందే శమంతకమణి హీరోల జోరు చూస్తుంటే.. తుది ఫలితం మీద వారెంత నమ్మకంగా ఉన్నారన్న విషయం చెప్పకనే చెప్పినట్లుగా లేదు?

Loading...